సముద్రంలో కూలిన హెలికాప్టర్‌.. ఐదుగురు సైనికులు మృతి

U.S. military says 5 crew members died in helicopter crash

న్యూయార్క్‌ః అమెరికా ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ మధ్యధార సముద్రం లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యూఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఈ ఘటన నవంబర్‌ 10న చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధారా ప్రాంతంలో అమెరికా ఓ ఆర్మీ బృందాన్ని మోహరించింది. ఇందులో భాగంగా రోజూవారీ శిక్షణలో భాగంగా నవంబర్‌ 10వ తేదీన ఆర్మీ హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరింది. కాసేపటికి సాకేంతిక సమస్య తలెత్తడంతో సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు యూఎస్‌ మిలిటరీ ఆదివారం వెల్లడించింది.

కాగా, సైనికుల మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వారి మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అమెరికా ప్రజలు సురక్షితంగా జీవితం గడపటం కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని బైడెన్ అన్నారు. దేశం కోసం వారి జీవితాలను, ప్రాణాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవలను జో బైడెన్ కొనియాడారు.