17న మేనిఫెస్టో విడుదల చేయనున్న తెలంగాణ బిజెపి

Telangana BJP to release manifesto on 17

హైదరాబాద్‌ః తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు.. కెసిఆర్ భరోసా, ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక అభ్యర్థులను ప్రకటించి ప్రచార రేసులో కాస్త లేటుగా చేరిన బిజెపి ప్రస్తుతం ప్రచారంలో జోరు సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నేతలను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత వారంలో రెండు సార్లు రాష్ట్రానికి వచ్చి బిజెపి బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

ఇక మరోసారి మోడీ రాష్ట్రానికి రానున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 24, 25, 27 తేదీల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 27వ తేదీన కరీంనగర్‌ బహిరంగసభలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్‌లో రోడ్‌షోతో మోడీ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మూడు రోజులు, బిజెపి జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా 5 రోజులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ మూడు రోజులు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 17వ తేదీన బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీన్ని పార్టీ అధ్యక్షుడు లేదా కేంద్రంలోని కీలక మంత్రి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌షా మేఫెస్టోను విడుదల చేస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు.