ముంబయి పేలుళ్ల ఘటన.. నిందితుడు రాణాను భారత్‌కు అప్పగించనున్న అమెరికా

26/11 దాడుల్లో ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేసిన నేరంపై జైలు శిక్ష అనుభవిస్తున్న తహావుర్

U.S. court allows extradition of 26/11 attack accused Pakistani-origin Canadian Tahawwur Rana to India

న్యూఢిల్లీః దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 2008 నంబర్ 26న జరిగిన ఉగ్రదాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న తహావుర్ రాణాను అమెరికా భారత్‌కు అప్పగించనుంది. ఈ విషయమై భారత్ గతంలో చేసిన అభ్యర్థనపై అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు తాజాగా సానుకూల తీర్పు వెలువరించింది. నేరస్తుల పరస్పర అప్పగింతకు సంబంధించి ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. జూన్ 22న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో తొలిసారి అధికారికంగా పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాద కట్టడి దిశగా అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

2008 నాటి ఉగ్రమూకల దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి తహావుర్ రాణా సన్నిహితుడు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన నేరంపై షికాగో కోర్టు తహావుర్ రాణాకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇక, దాడులకు ముందు తహావుర్ ముంబైలో చివరిసారిగా రెక్కీ నిర్వహించాడని డేవిడ్ హెడ్లీ వాంగ్మూలం ఇచ్చాడు.