సిరియాలో మరోసారి వరుస భూకంపాలు

సిరియా దేశాన్ని వరుస భూకంపాలు వదలడం లేదు. రీసెంట్ గా టర్కీ, సిరియా లలో చోటుచేసుకున్న భూకంపాలు కొన్ని వేలమందిని బలితీసుకోగా…గురువారం రాత్రి మరోసారి భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసాయి. నిన్న రాత్రి 10.47 గంటలకు 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూ ఉపరితలానికి 18.8 కిలోమీటర్ల లోతులో వచ్చిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్లో దూరంలో ఉందని తెలిపింది.

ఆ తర్వాత రాత్రి 11.17 గంటలకు వాయవ్య తీర ప్రాంతంలోని లటాకియాలో 3.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం లటాకియాకు 50 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 46 కిలోమీటర్ల లోతులో సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపాలతో సిరియా ప్రజలు నిద్రలేని రాత్రులను గడిపారు. ఎప్పుడు భూకంపం వస్తుందో అని అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.