భారత్‌లో రెండు ట్విట్ట‌ర్ ఆఫీసులు మూసివేత

ఇక మిగిలింది బెంగళూరు కార్యాలయమే

should-i-step-down-from-twitter-ceo-post-asks-elon-musk

న్యూఢిల్లీః ట్విట్టర్‌లో వ్యయాలు తగ్గించుకోవాలన్న ఎలాన్ మస్క్ అభిమతానికి అనుగుణంగా భారత్‌లో ట్విట్టర్‌కున్న రెండు కార్యాలయాలు మూతపడ్డాయి. న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసివేయగా.. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతోంది. ట్విట్టర్ గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించిన విషయం తెలిసిందే. సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా సుమారు 90 శాతమని ఓ అంచనా. ఇక బెంగళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ట్విట్టర్‌ను చేజిక్కించుకున్నాక మస్క్.. సంస్థను లాభాల బాట పట్టించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. 2023 కల్లా సంస్థకు ఆర్థిక స్థిరత్వం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఉద్యోగులను తొలగించడంతో పాటూ కార్యాలయాలను మూసివేస్తున్నారు. ఇక భారత్‌లో ట్విట్టర్.. ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు, రాజకీయ చర్చలకు కీలక వేదికగా మారింది. ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఏకంగా 86.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే.. మొత్తం ట్విట్టర్ ఆదాయంలో భారత్ వాటా స్వల్పమేనని సమాచారం.