టర్కీ భూకంపం : మృతుల సంఖ్య 20 వేల వరకు చేరుకునే అవకాశం

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన మూడు భారీ భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అల్లాడిపోయాయి. వేలాది భవనాలు నేలమట్టం కాగా, అందులో వేలాదిమంది చిక్కుకొని ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం నాల్గు వేల మంది మృత దేహాలు బయటకు తీయడం జరిగింది. ఇంకా వెలికితీత పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అంచనా ప్రకారం మృతుల సంఖ్య 20 వేల వరకు చేరే అవకాశం ఉందని డబ్లూ‌హెచ్‌వో చెపుతుంది. ఇప్పటివరకు 18 వేల మంది గాయపడినట్లు గుర్తించగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్క టర్కీ దేశంలోనే భూకంపం ప్రభావానికి 2,921 మంది చనిపోగా.. సిరియాలో 1,444 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం ఎంతమంది మరణించి ఉంటారనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశముందని విదేశీ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

మరోపక్క టర్కీకి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ వంద మంది సిబ్బందితో కూడిన రెండు బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలతోపాటు.. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్న వారిని గుర్తించే రెండు శునకాలను రెస్క్యూ ఆపరేషన్ కోసం పంపించడం జరిగింది. ఘజియాబాద్ నుంచి ఒకటి, కోల్‌కతా నుంచి మరొకటి చొప్పున ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కేంద్రం టర్కీకి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ సహయక చర్యల్లో పాల్గొననున్నారు. వీరికి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉందని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టడం కోసం వారు తగిన శిక్షణ పొంది ఉన్నారని ఆయన తెలిపారు.

మృతులకు ఇతర దేశాలు సంతాపం ప్రకటిస్తున్నాయి. 2021 ఆగస్టులో రిమోట్ సౌత్ అట్లాంటిక్‌లో సంభవించిన భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భూకంపం ఇప్పుడు సిరియా, టర్కీలో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.