తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..ఆనంద నిలయాన్ని వీడియో తీసిన భక్తుడు

విచారణ ప్రారంభించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు

ttd-security-failure-in-tirumala

తిరుమలః కలియుగ దైవం శ్రీ వేకంటేశ్వరుడి ఆలయంలో మరోమారు భద్రతా వైఫల్యం బయటపడింది. ఆదివారం రాత్రి ఓ భక్తుడు ఆనంద నిలయం వరకూ మొబైల్ ఫోన్ ను తీసుకెళ్లాడు. గర్భగుడిని బయటి నుంచి సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. ఓ భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళుతుంటే భద్రతా సిబ్బంది ఏంచేస్తున్నారని మండిపడుతున్నారు.

శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ ను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇతరత్రా లగేజీని కూడా అనుమతించరు. పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే, ఆదివారం ఓ భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళ్లాడు. ఆనంద నిలయాన్ని బయటి నుంచి వీడియో తీశాడు. విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలతో పాటు గర్భగుడి కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరుమల విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ సదరు భక్తుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.