ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో ఆమెను ఢిల్లీ కి తీసుకెళ్లనున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతుర్ని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన 12 మంది అధికారులు సుమారు 4 గంటలపాటు కవిత ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి, పలు డాక్యుమెంట్లను, ఫోన్లను స్వాధీనం చేసుకొని ఆమెకు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసారు.

కవితను ఈడీ అధికారులు అదుపులోకి టీఎసుకున్న వార్త తెలిసి కవిత నివాసం వద్దకు భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు , అభిమానులు, మహిళలు ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్ కు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తూ మోడీ కి , బిజెపి కి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా చేరుకొని.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన తనను అరెస్ట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉందని మరోసారి అధికారుల దృష్టికి తెచ్చారు. ఇక కవిత అరెస్ట్ సమాచారం అందుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం చేసారు. సుప్రీం కోర్ట్ లో విచారణ జరుగుతున్న వేళ ఎలా అరెస్ట్ చేస్తారని వారిని ప్రశ్నించారు.