ఎంపీ నవనీత్ కౌర్ కు వీఐపీ సెక్యూరిటీ

ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలన్న నవనీత్

ముంబయి: ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించకపోతే, ఆయన నివాసం వద్ద తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని సినీ నీటి, ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణా హెచ్చరించారు. దాంతో వీరికి ముంబయి పోలీసులు నోటీసులు పంపారు. అటు, శివసేన కార్యకర్తలు సైతం వీరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు వీఐపీ భద్రత కల్పించింది. నవనీత్ కౌర్ భద్రతకు ముప్పు ఉందని కేంద్ర నిఘా సంస్థ ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖకు నివేదిక అందజేసింది. నిఘా సంస్థ సిఫారసులకు ఆమోదం తెలిపిన కేంద్ర హోంశాఖ పారామిలిటరీ సాయుధ కమాండోలతో నవనీత్ కు ‘వై’ కేటగిరీ (సెంట్రల్ కవర్) భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ముగ్గురు నుంచి నలుగురు సీఐఎస్ఎఫ్ కమాండోలు నవనీత్ భద్రతా విధుల్లో పాల్గొంటారు.

ఆమెతో పాటు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ కు కూడా వీఐపీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కు ‘వై ప్లస్’ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/