షారుఖ్​ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై కేసు నమోదు

గౌరీ ఖాన్ ప్రచారకర్తగా ఉన్న నిర్మాణ సంస్థ తనకు ఫ్లాట్ ఇవ్వలేదని ఓ వ్యక్తి ఫిర్యాదు

Case against Gauri Khan, others in Lucknow over property purchase

ముంబయిః బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ భార్య, ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌పై లక్నోలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని నాన్ బెయిలబుల్ సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. గౌరీ ప్రచారకర్తగా ఉన్న కంపెనీ రూ. 86 లక్షలు వసూలు చేసినప్పటికీ తనకు ఫ్లాట్‌ను కేటాయించలేదని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో తనకు కేటాయించిన ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గౌరీతో పాటు తులసియాని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ సీఎండీ అనిల్ కుమార్ తులసియానీ, డైరెక్టర్ మహేశ్ తులసియానీలపై కూడా ఫిర్యాదు చేశారు. బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ ప్రభావంతో తాను ఫ్లాట్ కొన్నానని సుశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో, గౌరీ ఖాన్, అనిల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.