వరంగల్‌ ఎంజీఎంలో బాలుడి మృతి ఫై సర్కార్ సీరియస్

వరంగల్‌ ఎంజీఎంలో సర్జరీకి ముందు మత్తు మందు ఇస్తున్న సమయంలో బాలుడు మృతి చెందిన ఘటనఫై సర్కార్ సీరియస్ అయ్యింది. విరిగిన చేతికి సర్జరీ చేసే క్రమంలో మొదట బాలుడికి మత్తు మందు ఇవ్వగా.. ఊహించని విధంగా కార్డియాక్ అరెస్ట్‌కి గురయ్యాడు. వెంటనే ఆర్‌‌సీయూకి చేర్చి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. వైద్యుల నిర్లక్ష్యమే బాలుడి చావుకు కారణమంటూ అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విచారణకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అలెర్ట్ అయిన వరంగల్ అడిషనల్ కలెక్టర్ శ్రీవాస్తవ.. రంగంలోకి దిగి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మరణించాడని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సీనియర్లు లేకుండా జూనియర్ డాక్టర్లు మోతాదుకు మించిన ఇంజిక్షన్ ఇవ్వడం వల్లే బాలుడికి కార్డియాక్ అరెస్ట్ అయి మృతి చెందాడని అనుమానిస్తున్నారు. బాలుడి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటో తెలుస్తుందని అన్నారు. ఆ తర్వాతే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళ్తే… వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగ్యాంతండాకి చెందిన నీహాన్ (8)కి చేయి విరగడంతో అతని తల్లిదండ్రులు ఈ నెల 4న వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆసుత్రిలో చేర్పించారు. మంగళవారం (సెప్టెంబర్ 6) ఉదయం 10.30గం. సమయంలో వైద్యులు అతని చేతికి సర్జరీ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. సర్జరీకి ముందు అనస్తీషియా ఇవ్వగా.. బాలుడు అకస్మాత్తుగా కార్డియాక్‌ అరెస్ట్‌కి గురయ్యాడు. వెంటనే ఆర్‌సీయూ వార్డుకు తరలించి చికిత్స అందించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

మధ్యాహ్నం 1.10 గం. సమయంలో బాలుడు మృతి చెందినట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వైద్యులపై తీవ్ర కోపోద్రిక్తులైన బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎంజీఎం ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఆగ్రహంతో వైద్యులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.