68వ వసంతంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్

ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖుల శుభాకాంక్షలు

TS CM Kcr Birthday Celebrations
TS CM Kcr Birthday Celebrations

Hyderabad: టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో ఆయన 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా.. ఇటీవల జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్దం ప్రకటించి దూకుడు పెంచిన కేసీఆర్‌ ఇప్పటికే పవర్‌ సెంటర్‌గా మారారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. 1954 ఫిబ్రవరి 17న సిద్దిపేట చింతమడకలో రాఘవరావు వెంకటమ్మ దంపతులకు కేసీఆర్ జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలుపోరాడారు. తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన సీఎం కేసీఆర్.. స్వరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ తర్వాత నాలుగున్నరేళ్లకు తెలంగాణ కల సాకారమైంది. ఏపీ విభజన తర్వాత 2014లో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయనే సీఎంగా కొనసాగుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/