అయోధ్య రామయ్య దర్శనం, హారతి వేళల్లో మార్పులుః ఆలయ ట్రస్టు

Changes in Ayodhya Ramayya Darshan and Aarti Timings: Temple Trust

లక్నోః అయోధ్య రాముడి దర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కీలక సూచనలు చేసింది. రోజూ లక్షకు పైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారని వెల్లడించింది. భక్తుల సౌకర్యం కోసం, దర్శనం సులభంగా జరిగేందుకు పలు మార్పులు చేసినట్లు తెలిపింది. ఆలయంలో క్యూలోకి ప్రవేశించిన గంటలో బాల రాముడిని కనులారా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. దర్శనం, బాల రాముడి హారతి వేళల్లో చేసిన మార్పుల వివరాలను బుధవారం వెల్లడించింది.

దర్శన వేళలు: ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు..
మంగళ హారతి దర్శనం: భక్తులను తెల్లవారుజామున 4 గంటల నుంచి అనుమతిస్తారు.
శృంగార్ హారతి దర్శనం: ఉదయం 6: 15 గంటలకు భక్తులకు అనుమతి
శయన హారతి దర్శనం: ఈ హారతి దర్శనానికి ప్రత్యేకంగా ఎంట్రీ పాస్ ఉన్న భక్తులను రాత్రి 10 గంటలకు ఆలయంలోకి అనుమతిస్తారు.

ఆలయంలోకి వీటిని అనుమతించరు..
మొబైల్ ఫోన్స్, చెప్పులు, పర్సులను ఆలయం వెలుపలే వదిలి వెళ్లాలి. గుడిలోకి పూలు, పూల దండలు, ప్రసాదం తదితరాలను అనుమతించరు.

ఎంట్రీ పాస్ లు ఎలా తీసుకోవాలి..
ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ఎంట్రీ పాస్ లు తీసుకోవచ్చు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో.. రామ మందిరం ఆవరణలోనూ ఎంట్రీ పాస్ ను పొందవచ్చు. భక్తుల పేరు, వయసు, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, చిరునామా వివరాలు తెలియజేసి ఎంట్రీ పాస్ ను ఉచితంగా పొందవచ్చు. కాగా, అయోధ్య బాలక్ రామ్ మందిర్ లో స్పెషల్ దర్శనమంటూ ఏదీ లేదని, స్పెషల్ దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేయబోమని ట్రస్ట్ స్పష్టం చేసింది.

వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు..
రామయ్య దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆలయంలో వీల్ చెయిర్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో వీటిని ఉపయోగించుకునే వీలు కల్పించారు. ఈ సేవకు ఎలాంటి ఫీజు వసూలు చేయట్లేదని, అయితే వీల్ చెయిర్ తో సాయంగా ఉండే వాలంటీర్ కు నామమాత్రంగా కొంత మొత్తం చెల్లించాలని టెంపుల్ ట్రస్ట్ పేర్కొంది.