ఫ్లోరిడాలో ట్రంప్ ఎన్నికల ప్రచారం

అద్భుతమైన శక్తి ప్రవేశించింది… ఎవరికైనా గట్టిగా ముద్దివ్వగలను.. ట్రంప్

Trump-first-election-Rally-after-corona-treatment

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనా చికిత్స అనంతరం సోమవారం తొలిసారి ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. సామ్యవాద, మార్క్సిస్టు, లెఫ్ట్‌ భావజాల అతివాదులకు పార్టీని అప్పుజెబుతానని అంగీకరించిన బైడెన్‌ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారంటూ ట్రంప్‌ ఆరోపణలు చేశారు. తాను రాజకీయ నాయకుడినే కాదని.. తనకు ఆ పదం వింటేనే మొహమాటంగా ఉందని వ్యాఖ్యానించారు. తాను ఏమాత్రం వయసు మళ్లిన వ్యక్తిని కాదన్నారు. ఇంకా శక్తిమంతంగా తయారవుతనన్నారు. ‘నేను కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డాను. నా శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా ఉంది’ అని ఆయన అన్నారు.

‘నేనిప్పుడు చాలా బలంగా ఉన్నాను. అద్భుతమైన శక్తి నాలో ప్రవేసించింది. నేను ఎవరి మధ్యకైనా వచ్చి, మీలో ఎవరినైనా ముద్ద పెట్టుకోగలను. అది మగవారైనా, అందమైన మహిళలైనా… గట్టిగా ముద్దివ్వగలను’ అని వందలాది మంది మద్దతుదారుల కేరింతల మధ్య ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా, ట్రంప్ శరీరం నుంచి వైరస్ పూర్తిగా బయటపడిందని, ఆయన్నుంచి ఇక ఎవరికీ వైరస్ వ్యాపించదని వైట్ హౌస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే మూడు వారాల్లో విస్తృతంగా పర్యటించి, తన ప్రచారాన్ని నిర్వహించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలలో బైడెన్ తో పోలిస్తే, ట్రంప్ వెనుకబడివున్నారని తేల్చిన నేపథ్యంలో, ఆయన నష్ట నివారణ చర్యల్లో ఉన్నారని తెలుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/