భారీ వర్షాలకు వరదల్లో కొట్టుకుపోయిన బియ్యం లోడు లారీ..

బియ్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ వరదల్లో కొట్టుకుపోయిన ఘటన భూపాలపట్నం సబ్ డివిజన్‌లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలో ఆదివారం పీడీఎస్ బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. భూపాలపట్నం మెట్టుపల్లి వద్ద బడా నాలాపై నుంచి వెళ్తుండగా ఇంజన్లో సమస్య తలెత్తడంతో లారీ ఆగిపోయింది. వరద నీరు అంతకంతకూ పెరుగుతుండటంతో డ్రైవర్ ట్రక్కును వరద నీటిలోనే వదలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లిన కాసేపటికే వరద ప్రవాహం మరింత పెరగడంతో బియ్యం బస్తాలతో నిండిన లారీ కొట్టుకుపోయింది. దాంతో అందులో ఉన్న టన్నుల కొద్దీ రేషన్ బియ్యం నీటిపాలైంది. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పక్కనున్న రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. అల్ప పీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు తెగిపోయాయి. పంటపొలాలు నీటమునిగాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నీటిలో మునిగాయి. మరో రెండు , మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.