ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్ : నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఘాట్ వద్దకు చేరుకున్న మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపీ నామనాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి పరిటాల సునీత, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించి ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు.

‘ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఆదేశాల మేరకే ఇప్పటికీ ఆయన అభిమానులు పని చేస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అవ్వాల్సింది.. జస్ట్‌లో మిస్ అయింది.’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా కృషి చేస్తాం. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తారాస్థాయిలో అభిమానులున్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్’ అని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మధ్య దళారులు లేకుండా ప్రజలకు అన్ని రకాల సంక్షేమం చేరుకోవాలని ఆకాంక్షించారు. తన వద్ద అర్ధరూపాయి కూడా లేకున్నా.. తనని మంత్రి చేసి.. తనకు పెళ్లి చేసిన గొప్ప మనసున్న వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/