ఉక్రెయిన్ కు నిధులు పంపే బదులు స్కూళ్ల భద్రతకు నిధులివ్వండి: ట్రంప్
ఇతర ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ముందు ఇది చేయాలంటూ సూచన

వాషింగ్టన్ : కొన్ని రోజుల క్రితం టెక్సాస్‌లో ఓ ఉన్మాది స్కూల్‌లోకి ప్రవేశించి 19 మంది విద్యార్థులను కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ హూస్టన్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. గన్ వినియోగదారులకు మద్దతు పలుకుతూ జోబైడెన్ సర్కారును ఏకిపారేశారు. హూస్టన్ లో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) వార్షిక సమావేశం జరిగింది. దీనికి ట్రంప్ హాజరై మాట్లాడారు. దేశంలోని స్కూళ్ల భద్రత కంటే ఉక్రెయిన్ యుద్ధమే బైడెన్ సర్కారుకు ప్రాధాన్యంగా మారిందని విమర్శించారు. పాఠశాలల్లో భద్రతపై సర్కారు దృష్టి పెట్టాలని సూచించారు.
‘‘యూఎస్ 40 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ కు పంపిస్తోంది. మన పిల్లలను భద్రంగా కాపాడుకునేందుకు మనం ఏమైనా చేయగలగాలి. ఇరాక్, ఆప్ఘానిస్థాన్ లో మనం లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేశాం. అందుకు మనకు ఒరిగిందేమీ లేదు. మిగిలిన ప్రపంచాన్ని, దేశాలను నిర్మించే ముందు.. సొంత దేశంలో మన పిల్లలకు సురక్షితమైన పాఠశాలలను నిర్మించాల్సి ఉంది’’ అని ట్రంప్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
సామూహిక హననానికి పాల్పడే ఘటనలను చూసి.. శాంతి, చట్టానికి కట్టుబడి ఉండే లక్షలాది మంది ప్రజలను (గన్ వినియోగదారులు) నిందించడం సరికాదని ట్రంప్ అన్నారు. ఎన్ఆర్ఏ అన్నది యూఎస్ లో గన్నుల యజమానుల అతిపెద్ద సంఘం. గన్నులను నియంత్రించే చర్యలకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తుంటుంది. రష్యాతో ఢీకొడుతున్న ఉక్రెయిన్ కు 45 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించే ప్రతిపాదనకు యూఎస్ ఇటీవలే ఆమోదం తెలపడం గమనించాలి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/