కేసీఆర్ కోసం క్వార్టర్ బాటిళ్లను పంపిణి చేస్తున్న టిఆర్ఎస్ నేతలు

కేసీఆర్ ప్రధాని కావాలంటూ టిఆర్ఎస్ నేతలు క్వార్టర్ బాటిళ్లను, కోళ్లను పంపిణి చేస్తున్నఘటన వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. రేపు దసరా సందర్బంగా మధ్యాహ్నం 1:19 గంటలకు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. దసరా పండుగ రోజున టీఆర్‌ఎస్‌ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నది. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ పార్టీ ప్రకటనను చేయనున్నారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలు కేసీఆర్ జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని , అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ గుడిలలో ప్రత్యేక పూజలు , ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకొంతమంది నేతలైతే కోళ్లను , మద్యం బాటిళ్లను పంచుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తాజాగా వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేత రాజనాల శ్రీహరి..పేద హమాలీలకు 200 కోళ్లను మరియు 200 క్వార్టర్ బాటిల్లను పంపిణీ చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశ వ్యాప్తంగా జాతీయ పార్టీ పెట్టబోతున్న శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్‌.. దేశ ప్రధానమంత్రి కావాలని అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని గా కల్వకుంట్ల తారకరామారావు గారు ఎంపికై రాబోయే ఎన్నికల్లో వారు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ గా మారాయి.