మళ్లీ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా

north-korea-fires-ballistic-missile-over-japan-amid-tensions

సియోల్‌ః ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని మంగళవారం దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఉత్తర కొరియా తూర్పు వైపున జపాన్‌ గగనతలం మీదుగా గుర్తు తెలియని బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, జపాన్‌ కోస్ట్‌గార్డ్‌ సైతం ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు ధ్రువీకరించింది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ప్రజలకు సూచించింది.

ఉత్తర కొరియా మిస్సైల్‌ ప్రయోగంపై జపాన్‌ ప్రధాని కిషిదా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఉత్తర కొరియా ఈ ఏడాది రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించింది. గతవారం నాలుగుసార్లు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైల్‌ను పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంతోపాటు ఆ దేశంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పర్యటించడంతో ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను పరీక్షిస్తున్నది. అయితే, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మరో అను పరీక్షకు సిద్ధమవుతున్నారని దక్షిణ కొరియా, అమెరికా వర్గాలు గత కొద్ది నెలలుగా హెచ్చరిస్తున్నాయి. అక్టోబర్‌ 16న జరుగబోయే చైనా పార్టీ కాంగ్రెస్‌ తర్వాత జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/