ఆదిపురుష్ డైరెక్టర్ ఫై బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ ఆగ్రహం

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తం నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇక ఆదివారం విడుదలైన టీజర్ ఒక్కసారిగా సినిమాను విమర్శల పాలుచేసింది. టీజర్ చూస్తుంటే కార్టున్ వీడియో చూసినట్లు ఉందని ప్రభాస్ అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ పోషించిన లంకేశుడి పాత్ర తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. పొట్టి ఉంగరాల జుట్టు, బాగా పెంచిన గెడ్డం, కాటుక కళ్లతో ఉన్న సైఫ్ అలీఖాన్ లంకేశుడి పాత్ర రావణాసురిడిలా కాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీలా ఉందంటూ కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇదే పాత్రను ఉద్దేశించి ప్రముఖ కన్నడ నటి, బీజేపీ అధికార ప్రతినిధి మాళవిక అవినాష్.. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణంను ఓం రౌత్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘‘వాల్మీకి రామాయణం, కంబ రామాయణం, తులసీదాస రామాయణంతో పాటు రామాయణం గురించి చెప్పే చాలా గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ డైరెక్టర్ పక్కనపెట్టడం నన్ను ఎంతగానో బాధించింది. థాయిలాండ్‌లో సైతం రామాయణం గురించి చాలా అందమైన ప్రదర్శనలు ఇస్తారు. రామాయణంపై ఇప్పటికే అనేక కన్నడ, తెలుగు, తమిళ సినిమాలు వచ్చాయి. వాటిలో రావణుడు ఎలా ఉంటాడో చూపించారు. కనీసం మన సినిమాలను కూడా దర్శకుడు చూడలేకపోయారు’’ అని మండిపడ్డారు.