మహబూబాబాద్ టీఆర్ఎస్ కౌన్సిలర్ హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నిన్న గురువారం మహబూబాబాద్ లోని పత్తిపాకలో దారుణ హత్య చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ 8 వ వార్డు కౌన్సిలర్‌ బానోత్‌ రవి ని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసు లో భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్,అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్ లు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసారు.

వీరి నుండి గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలకు అడ్డు పడుతూ పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్న కారణంగానే రవిని హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ వెల్లడించారు. ఈ హత్య లో విజయ్, అరుణ్ ప్రధాన నిందితులు, మిగిలిన ఐదుగురు వారికి సహకరించినట్లు ఎస్పీ తెలిపారు. బానోతు రవి తో కలిసి వీరంతా గతంలో అక్రమ వ్యాపారాలు చేసేవారు. కానీ ఇప్పుడు రవితో విడిపోయి.. స్వతహాగా వీరంతా తమకు తామే వ్యాపారాలు చేస్తున్నారు.