షాప్ ఓపెనింగ్ లో చేదు అనుభవం..

షాప్ ఓపెనింగ్ లో అనుపమ పరమేశ్వరన్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రేమమ్ , శతమానం భవతి , అ ఆ , ఉన్నది ఒకటే జిందగీ వంటి హిట్స్ తో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న అనుమప..ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంది. అంతే కాదు కుదిరినప్పుడల్లా షాప్ ఓపెనింగ్స్ చేస్తూ వస్తుంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్య క్రమంలో అమ్మడికి అభిమానుల నుండి చేదు అనుభవం ఎదురైంది.

ఇటీవల కోదాడ, సూర్యాపేటలో ఓ షాప్ ఓపెనింగ్ వేడుకకు హాజరైంది. ఈమెను చూసేందుకు వందలాది మంది గుమిగూడారు. ఆమె అందమైన చిరునవ్వుతో ప్రజలను పలకరించారు. స్థానికులు, అభిమానులు తమ మొబైల్ కెమెరాల ద్వారా ఆమె ఆనంద క్షణాలను బంధించేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లి పోయేందుకు సిద్ధమైంది. దీంతో కొందరు ఆకతాయిలు ఆమె ప్రయాణించే కారు టైర్లలో గాలి తీశారు. అనంతరం షాపు నిర్వాహకులు ఆమెకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్ కు పంపించారు. ఈ ఘటన తో ఆమె షాక్ కు గురైంది.