అయోధ్య‌లో భ‌క్తుల తాకిడి.. త్రేతా యుగ కాలాన్ని త‌ల‌పిస్తోందిః ఆచార్య సత్యేంద్ర దాస్‌

‘Treta Yug’.. Ram mandir chief priest reacts amid massive rush at Ayodhya temple

అయోధ్య‌ః అయోధ్య‌లో రామ మందిర ప్రారంభోత్స‌వం అనంత‌రం సాధార‌ణ భ‌క్తుల‌కు ప్ర‌వేశం క‌ల్పించిన తొలిరోజు మంగ‌ళ‌వారం భ‌క్తులు పోటెత్తారు. అయోధ్య న‌గ‌రం శ్రీరాముడు నివ‌సించిన నాటి రోజుల్లో త్రేతా యుగ కాలాన్ని త‌ల‌పిస్తోంద‌ని శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్ధ క్షేత్ర ప్ర‌ధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పారు. ప్రాణ ప్ర‌తిష్ట అనంత‌రం అయోధ్య న‌గ‌రం ప‌విత్ర‌త‌ను సంత‌రించుకుంద‌ని, త్రేతా యుగంలో శ్రీరాముడు అయోధ్య‌కు తిరిగివ‌చ్చిన త‌ర్వాత న‌గ‌రం శోభాయ‌మానంగా మారింద‌ని, ఆనాటి దృశ్యం ఇప్పుడు సాక్షాత్క‌రిస్తోంద‌ని పేర్కొన్నారు. ఎంతోమంది భ‌క్తులు ప్ర‌స్తుతం అయోధ్య త‌ర‌లివ‌స్తున్నార‌ని, ఎటుచూసినా జై శ్రీరాం నినాదాలు మార్మోగుతున్నాయ‌ని ఇదంతా చూస్తుంటే మ‌నం తిరిగి త్రేతా యుగం నాటి అయోధ్య‌కు తిరిగి వెళ్లామ‌ని అనిపిస్తోంద‌ని అన్నారు.

ఆల‌య ప్ర‌ధాన ద్వారాల వ‌ద్ద భ‌క్తుల తాకిడి చూస్తుంటే ఆల‌యం తెరుచుకున్న మొద‌టి రోజే భ‌క్తులంద‌రికీ ద‌ర్శ‌నం సాధ్యం కాద‌ని చెప్పారు. మ‌రికొద్ది రోజులు కూడా ఆల‌యం వ‌ద్ద భ‌క్తుల క్యూ ఇలాగే ఉంటుంద‌ని అన్నారు. దేశ‌వ్యాప్తంగా 4000 మంది స‌న్యాసులు అయోధ్య‌కు త‌ర‌లివ‌చ్చార‌ని, వారంతా త‌మతో పాటు మ‌రో ఇద్ద‌రు నుంచి న‌లుగురు వ్య‌క్త‌ల‌ను తీసుకువ‌చ్చార‌ని అందుకే ర‌ద్దీ అధికంగా ఉంద‌ని చెప్పారు. రాముడి ద‌ర్శ‌నం కోసం వారెంతో ఉత్సుక‌త‌తో వేచిచూస్తున్నార‌ని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు.