పండుగ పూట విషాదం..భవనం పైనుంచి పడి బాలుడి మృతి

శ్రీకృష్ణాష్టమి రోజున విషాదం చోటుచేసుకుంది. సూరారం కాలనీ లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో 13 ఏళ్ల తులసీనాథ్ అనే బాలుడు భవనం పైనుంచి పడి దుర్మరణం పాలయ్యాడు. గురువారం (సెప్టెంబర్ 7) శ్రీకృష్ణాష్టమి నేపథ్యంలో పాఠశాలకు సెలవు రోజు కావడంతో బాలుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆడుకునేందుకు భవనం నాలుగో అంతస్తులోని డాబా మీదకు వెళ్లాడు. అయితే, ఆ భవనానికి పిట్ట గోడలు (సైడ్ వాల్స్) లేవు. ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

రాజీవ్ గృహకల్ప 29వ బ్లాక్ 3వ అంతస్తులో ఉంటున్న కనకరత్నం కుమారుడు తులసీనాథ్ (13) స్థానికంగా ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అప్పటివరకు కళ్లముందు ఆడుకుంటున్న కుమారుడు..ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడం చూసి, బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.