నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం‌ సందర్బంగా నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా జూన్‌ 2నుంచి 22వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌ , పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు రూట్లలో వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. ఈ సందర్భంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆ మార్గాల్లో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు చూస్తే..

-> వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదాన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు.

-> ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు. అలాగే, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జం క్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.

-> అఫ్టల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

-> ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

-> బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

-> బడాగణేశ్‌ లేన్‌ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లేన్‌లోకి మళ్లిస్తారు.

-> మింట్‌లేన్‌ నుంచి బడాగణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు.