బిజెపి , కాంగ్రెస్ పార్టీల సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్

రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే అని కాంగ్రెస్ , బిజెపి పార్టీల అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని ఆయా పార్టీలను మంత్రి కేటీఆర్ డిమాండ్ చేసారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్‌ఎస్సేనని , మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టంచేశారు. దక్షిణాదిలో వరుసగా తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న అరుదైన రికార్డు సాధించిన కేసీఆర్‌కు అభినందనలు తెలియజేశారు.

సిలిండర్‌ ధరను రూ.400 నుంచి రూ.1,200కు పెంచిన మోడీకి ఓటేయవద్దని ప్రజలకు, మహిళలకు గుర్తు చేస్తామని తెలిపారు. దేశంలో కొత్తగా ఏదైనా పార్టీ వచ్చి ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తీరుస్తుందనుకుంటే పార్టీకి తప్పకుండా ఓటేస్తారని, దీనికి తెలంగాణాలో 2014లో జరిగిన ఎన్నికలే ఒక ఉదాహరణ అని కేటీఆర్ అన్నారు. దేశానికి కావాల్సింది విద్వేషం, విభజన కాదని, మంచి విధానాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల కోసం ఏమి చేద్దామనే అంశంపై పార్టీలు చర్చించుకోవాలని, కలవాలని ఆకాంక్షించారు. కేవలం ఒక వ్యక్తిని గద్దె దించడం, మరో వ్యక్తిని గద్దెనెక్కించడం ఎజెండాగా ఉండరాదని స్పష్టంచేశారు. మోదీని గద్దె దించడమే ఎజెండా కాకూడదని, దేశ ప్రజల ముందు ఒక ప్రత్యామ్నాయ ఎజెండాను పెట్టాలని సూచించారు.