ఈరోజే రకుల్ ను విచారించబోతున్న ఈడీ అధికారులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసులో ఈడీ సినీ రంగానికి చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరి జగన్నాధ్ , ఛార్మి లను విచారించి వారి నుండి కీలక సమాచారం రాబట్టగా..ఈరోజు నటి రకుల్ ప్రీతి సింగ్ ను విచారించబోతున్నారు. వాస్తవానికి ఈనెల 6న విచారణకు హాజరుకావాలని ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

వ్యక్తిగత కారణాల దృష్ట్యా తేదీని మార్చాలంటూ ఈడీ అధికారులకు రకుల్‌ లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించిన అధికారులు.. తొలుత ఆమె అభ్యర్థనను తిరస్కరించినా.. శుక్రవారం విచారణకు రావాలని ఆదేశించారు. గతంలో సిట్‌ అధికారులు విచారించిన సినీ స్టార్స్ జాబితాలో రకుల్‌ పేరు లేదు కానీ కెల్విన్‌కు ఆమె నగదు పంపించినట్లుగా ఈడీ ఆధారాలు లభించడం తో ఆమెను విచారించబోతున్నారు.

సెప్టెంబరు 8 వ తేదీన రానా దగ్గుబాటి ని, 9వ తేదీన రవితేజను, శ్రీనివాస్ ను, 13వ తేదీన నవదీప్ తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ ను , 15వ తేదీన ముమైత్ ఖాన్ ను, 17న తనీష్, 20వ తేదీన నందు, 22వ తేదీన తరుణ్ లను ఈడీ అధికారులు విచారించనున్నారు. 2017 లో నమోదైన కేసులు ఆధారంగా పలు కీలక విషయాలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.