మంత్రి తలసానితో టాలీవుడ్ సినీ నిర్మాతలు, దర్శకుల భేటీ

తాజా పరిణామాలు, పరిస్థితులపై చర్చ

హైదరాబాద్ : తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్యలతో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలు అంటూ జరుగుతున్న ప్రచారం తదితర అంశాలపై వారు మంత్రితో చర్చించినట్టు తెలుస్తోంది.

ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ ప్రవేశించిందన్న వార్తలతో సినీ రంగం ఆందోళన చెందుతోంది. రానున్న సంక్రాంతి సీజన్ లో పలు పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ డిసెంబరులోనూ పలు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు మంత్రిని కలిసినట్టు సమాచారం.

కాగా, అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు, బుల్లితెర రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందని అన్నారు. ఇండస్ట్రీలో కులాలు, మతాలు, ప్రాంతీయ భావనలకు చోటు లేదని, టాలీవుడ్ ఇప్పుడు ఎంతో ఉన్నతస్థాయిలో ఉందని పేర్కొన్నారు.

.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/