కేంద్రం దెబ్బ కు ప్రయాణికులపై భారం మోపిన TSRTC

కేంద్రం దెబ్బకు TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా నేటి నుండి టోల్ చార్జీలను ఏకంగా 5 % కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో TSRTC ఆ భారాన్ని ప్రయాణికులపై వేసింది. గరుడ ప్లస్ మొదలు ఆర్డినరీ బస్సుల వరకు ఒక్కో టికెట్‌పై 4 రూపాయలు, ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున టోల్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. అలాగే, టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ అదనంగా రూ. 4 వసూలు చేయనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ టికెట్ ధరలు భారీగా పెరిగాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతుంటే..ఇప్పుడు అదనపు భారం తో మరింత భారంగా మారింది.

మరోపక్క ఈ టోల్ చార్జీల పెంపును వెనక్కు తీసుకోవాలంటూ కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ రాయడం జరిగింది. ఇప్ప‌టికే కేంద్రం వ‌సూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పెనుభారంగా మారింది.

టోల్ ట్యాక్స్ పెంపుద‌ల నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 2014లో రూ. 600 కోట్లు టోల్ ట్యాక్స్ వ‌సూలు చేశారు. ఆ త‌ర్వాత‌ ప్ర‌తి ఏడాది పెంచుకుంటూ పోయారు. 2023 నాటికి రూ. 1824 కోట్ల టోల్ ట్యాక్స్ వ‌సూలు చేశారు. ఈ 9 ఏండ్ల‌లోనే టోల్ ట్యాక్స్ 300 శాతం పెంచ‌డంతో.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కూడా విప‌రీతంగా పెరిగాయ‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.