నల్గొండ జిల్లాలో తిరుగుతున్న సైదాబాద్ నిందితుడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంత మాట్లాడుకునేది సింగరేణి కాలనీ ఘటన గురించే. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు త్వరగా పోలీసులకు దొరకాలని అంత కోరుకుంటున్నారు. పోలీసులకు సవాల్ గా మారిన ఈ ఘటన గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్న ఇంకా నిందితుడు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు.

నిందితుడి ఫొటోలను ప్రింట్ చేయించి ఆటోలు, బస్సులకు అంటిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసు నంబర్లకు ఫోన్ చేయాలని కోరుతున్నారు. నగరంలోనూ ఫుట్‌పాత్‌లు, వైన్‌షాపులు, కల్లు కాంపౌండ్‌లు, బస్టాండ్లు తదితర ప్రదేశాలను జల్లెడ పడుతున్నారు. వాహనదారులకు ఫొటోలు చూపిస్తూ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిందితుడు నల్గొండ జిల్లాలో ఉన్నట్లు తెలుస్తుంది.

విజయవాడ హైవేలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా సీసీటీవీ రికార్డైందని.. నిందితుడు రాజు మాదిరిగానే ఉన్నాడని చెబుతున్నారు. గడ్డం.. జుట్టుని ముడి వేసుకుని కవర్ పట్టుకుని వెళ్తున్న ఫొటోలు బయటికొచ్చాయి. నిందితుడు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో తిరుగుతున్నాడని ఓ నెటిజన్ ఫొటోను ట్వీట్ చేశాడు. ఆ ఫొటోలోని వ్యక్తి నిందితుడు రాజులా కనిపిస్తుండడంతో అతనే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.