తెలంగాణలో లాక్‌డౌన్.. ఉంటుందా లేదా?

కరోనా సెకండ్ వేవ్‌తో యావత్ భారతదేశం అల్లాడుతోంది. ఒకపక్క రోజూవారీ కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతుంటే, అంతే తీవ్ర స్థాయిలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా దేశంలోని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించుకుని కరోనా కట్టడికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అంత భయాందోళనకు గురిచేసేలా లేవని ఇటీవల సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ కరోనా విజృంభన తీవ్ర స్థాయిలో ఉందని, లాక్‌డౌన్ ఒక్కటే ప్రజల ప్రాణాలను కాపాడగలదని పలువురు నిపుణులు, ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటు హైకోర్టు కూడా వీకెండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోబోతున్నారు. మంగళవారం కేబినెట్ మంత్రులతో కరోనా పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించి, లాక్‌డౌన్ విధింపుపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

దీంతో మంగళవారం కేసీఆర్ ఏం చెబుతాడా అని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కట్టడికి లాక్‌డౌన్ చివరి అస్త్రంగా వాడుకోవాలని ప్రధాని మోదీ చెప్పడంతో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి తెలంగాణలో లాక్‌డౌన్ ఉంటుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.