వికటించిన చైనా వ్యాక్సిన్‌..ప్రయోగాలు నిలిపివేత!

వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు

వికటించిన చైనా వ్యాక్సిన్‌..ప్రయోగాలు నిలిపివేత!
China-vaccine-trial

రియోడిజనిరో: కరోనా వైరస్‌ నియంత్రణకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోన్న చైనా వ్యాక్సిన్‌ ‘కరోనావాక్‌’ కు సంబంధించి బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రయోగాలకు ఆటంకం కలిగింది. వ్యాక్సిన్ వికటించడంతో ఆ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపింది. ఈ విషయంపై బ్రెజిల్ లోని సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.

చైనా వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయోగాల్లో ఇలా జరగటం ఇదే మొదటిసారి. వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు బ్రెజిల్‌కు చెందిన బయోమెడికల్ పరిశోధనా కేంద్రం బుటాంటన్‌ ఇన్‌స్టిట్యూట్‌ గత నెలలో ప్రకటన చేసింది. అయితే, ఇంతలోనే ఆ వ్యాక్సిన్ వికటించడం గమనార్హం. అతి త్వరగా వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది. ఎన్నో నియమాలను సడలించి మరీ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాతో పాటు పలు దేశాల వ్యాక్సిన్లు వికటిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు చేరుకున్న సమయంలో వికటించిన విషయం తెలిసిందే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/