తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలు మొదలు

వాయుగుండం ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. తిరుపతి లో ఎడతెరుపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. భారీగా వర్షం పడుతుండటంతో తిరుమల భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. నిన్న కొండచరియలు విరిగి పడడంతో కొండపైకి భక్తులను అనుమతించడం లేదు.

యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగిన టీటీడీ ఇంజినీరింగ్ సిబ్బంది కొండచరియల నుంచి రాళ్లు పడకుండా తగిన ఏర్పాట్లు చేశారు. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేశారు. ఈ నేపథ్యంలో రెండో ఘాట్ రోడ్డుపై రాకపోకలు మొదలయ్యాయి. భారీ వర్షాలకు నిన్న తిరుమల ఘాట్ రోడ్డుపై 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక మార్గంలోనే వాహనాలను అనుమతించారు. ఇప్పుడు రెండో ఘాట్ రోడ్డు కూడా తెరుచుకోవడంతో కొండపైకి రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.