నా తరఫున, రైతుల తరఫున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

అమరావతి : గత పార్లమెంట్ సమావేశాలలో ఆమోదం పొందిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం శుభపరిణామమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తరఫున, రైతుల తరఫున ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చట్టాలు రైతుల ఆమోదం పొందలేకపోవడంతో రానున్న పార్లమెంట్ సమావేశాలలో ఈ చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించడం ఆయనలోని రాజనీతిజ్ఞతను తెలుపుతోందన్నారు.

గురునానక్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగాన్ని ఆద్యంతం పరిశీలిస్తే జనవాక్కును శిరోధార్యంగా భావించినట్లుగా మనకు అవగతం అవుతుందని పవన్ అన్నారు. ఏడాదిగా రైతులు చేసిన పోరాటానికి ఒక ఫలప్రదమైన ముగింపు ఆవిష్కృతం కావడం ఒక శుభపరిణామమన్నారు. ఎండనక వాననకా ఏడాదిపాటు ఈ ఉద్యమాన్ని నడిపి, చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లిన రైతులు, రైతు నాయకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. పోరాటం చేస్తే సాంధించలేనిది ఏది లేదని రైతుల ఉద్యమం మరోసారి నిరూపించిందని పవన్ వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/