ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ రాజీనామా

రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆ లేఖను గవర్నర్ బేబీ మౌర్యకు అందజేశారు. నాలుగు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరత్ సింగ్ ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరగడం అనుమానంగానే ఉంది. గడువు ముగిసే వరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉండడంతో దానిని నివారించేందుకు ముందస్తుగా ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు సొంతపార్టీ నుంచి కూడా ఆయనకు నిరసన సెగ మొదలైంది. దీంతో గత మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన తీరత్ సింగ్ నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం తన రాజీనామా లేఖను అందించారు. తీరత్ సింగ్ ప్రస్తుతం గర్వాల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఈసారి సిట్టింగ్ అభ్యర్థికే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/