ప్రతిపక్షాలను తిట్టేవారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందిః పార్థసారథి

పెనమలూరు టికెట్ తనకు ఎందుకు ఇవ్వలేదో పార్టీ పెద్దలే చెప్పాలన్న పార్థసారథి

Those who insult the opposition parties are preferred in the party: Parthasarathy

అమరావతిః తాను ఎవరినీ తిట్టలేనని, దుర్భాషలాడలేననే ఉద్దేశంతోనే తనను వైఎస్‌ఆర్‌సిపికి దూరం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. 25 ఏళ్ల నుంచి తనకు పెనమలూరు నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఉందని చెప్పారు. ప్రతిపక్షాలను తిట్టేవారికే వైఎస్‌ఆర్‌సిపిలో ప్రాధాన్యత ఉంటుందని విమర్శించారు. తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని తెలిపారు. పార్టీ కోసం తాను ఎంతో చేశానని, పార్టీ ఆఫీస్ కోసం ఎంతో విలువైన తన భూమిని కూడా ఇచ్చానని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు, తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

జిల్లాలో మిగిలిన నాయకులకంటే ఎక్కువగా పార్టీ కోసం పని చేశానని పార్థసారథి చెప్పారు. పెనమలూరు నుంచి కాకుండా గన్నవరం నుంచి తనను ఎందుకు పోటీ చేయించాలనుకునన్నారని ఆయన ప్రశ్నించారు. గన్నవరంలో తనను పోటీ చేయించి ఓడించాలనుకున్నారా? లేక పెనమలూరులో మరో బలమైన అభ్యర్థిని పెట్టి గెలిపించాలనుకున్నారా? అని అడిగారు.

పెనమలూరు టికెట్ తనకు ఎందుకు ఇవ్వలేదో పార్టీ పెద్దలే చెప్పాలని అన్నారు. తన సొంత నియోజకవర్గం పెనమలూరు నుంచి పోటీ చేయాలనేదే తన కోరిక అని చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబుతో పార్థసారథి భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం టిడిపిలో ఆయన ఎప్పుడు చేరబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.