ఈసారి ఏపీలో పోలింగ్ కౌంటింగ్ ఆలస్యమే..!

మే 13 న ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 04 న వీటి ఫలితాలను వెల్లడి కాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రంలో పోలింగ్ జరగడం తో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ దఫా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఇందుకు కారణం అని అంటున్నారు. 2019లో 2.62లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటే ఈసారి ఆ సంఖ్య 4.97 లక్షలుగా ఉంది. వీటి లెక్కింపునకు సుదీర్ఘ సమయం పడుతుంది. పైగా వీటి తర్వాతే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. జూన్ 4న ఉ.8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. 10గంటల తర్వాతే ట్రెండ్ తెలిసే పరిస్థితులున్నాయి.

అలాగే ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4న అల్లరు చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఏపీవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు సహా అనుమానిత ప్రదేశాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అక్రమ ఆయుధాలు, గుర్తింపు లేని వాహనాలు, పేలుడు పదార్థాలు వంటివి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 24కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.