పిన్నెల్లికి హైకోర్టు కండిషన్లు

Police search for Pinnelli.. EC orders for arrest

మాచర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి నిన్న ఊరట కలిగించిన ఏపీ హైకోర్టు నేడు (మే 24) కాస్త షాక్ ఇచ్చింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు నరసరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల వెళ్లవద్దని పిన్నెల్లిని ఆదేశించింది. అయితే నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. ఇక, కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. కేసు గురించి సాక్షులతో కూడా మాట్లాడరాదని ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. అదే సమయంలో, పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని… ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ సీఈవోని ఆదేశించింది.

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్ కావడంతో ఈసీ కఠినంగా స్పందించింది. పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పిన్నెల్లి పరారీలో ఉన్నారు. ప్రత్యేక పోలీసు టీమ్ లు ఆయన కోసం గాలించాయి. దీంతో పిన్నెల్లి‌పై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి హైదరాబాద్‌లో ఉన్నారని సమాచారం రావడంతో తెలంగాణకు వెళ్లి ఏపీ పోలీసులు గాలించారు. ఇంతలో పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పై పిటిషన్ వేశారు.