మేడ్చల్ లోని ఓ వైన్ షాప్ లో ఫైరింగ్‌ కలకలం..

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో దొంగల ముఠా ఫైరింగ్‌ కలకలం సృష్టించింది. ఓ వైన్‌షాప్‌లోకి చొరబడ్డ దుండగులు భీభత్సం సృష్టించారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.

వివరాల్లోకి వెళ్తే…

ఉద్దమర్రిలో మద్యం షాపు నిర్వహిస్తోన్న బాలకృష్ణ అనే వ్యక్తి.. రాత్రి వైన్‌షాపు మూసివేసి తిరిగి వెళ్తున్న సమయంలో.. దుండగులు అతనిపై దాడి చేశారు. తుపాకీతో బెదిరించారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ తర్వాత కర్రలతో బాలకృష్ణపై దాడి చేసి.. అతని దగ్గర ఉన్న రూ. 2 లక్షలను తీసుకుని పరారయ్యారు. మంకీ క్యాప్ ధరించిన ముగ్గురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.