మహారాష్ట్ర గవర్నర్‌ పదవి నుంచి తప్పుకుంటా : కోష్యారీ

Bhagat Singh Koshyari
Bhagat Singh Koshyari

ముంబయిః గవర్నర్‌ పదవి ఇక చాలని, పదవి నుంచి దిగిపోతానని మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ సోమవారం ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ముంబయి వచ్చినప్పుడు ఇక తాను పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు ఆయనతో చెప్పినట్లు కోశ్యారీ తెలిపారు. ప్రధాని మోడీకి తనంటే ఎంతో అభిమానమని.. తన నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తారనుకుంటున్నట్లు కోశ్యారీ వెల్లడించారు. తన శేషజీవితం ఇక చదువుతూ, రాస్తూ, ఇతర కార్యక్రమాలతో గడిపేస్తానని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర లాంటి గొప్ప రాష్ర్టానికి గవర్నర్‌గా పని చేయడం తనకు దక్కిన గౌరవమన్నారు. కోశ్యారీ ఇంతకుముందు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.

కాగా, విద్యాసాగర్ రావు తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన భగత్ సింగ్ కోశ్యారీ..అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్రను విడిచిపెట్టి పోతే..రాష్ట్రంలో డబ్బు మిగలదని..దేశంలో ఆర్థిక రాజధానిగా ఉండే అర్హత ముంబై కోల్పోతుందంటూ వ్యాఖ్యానించారు. అలాగే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీని పాత రోజుల్లో ఐకాన్‌గా భావించేవారని..కానీ ఇప్పుడు అంబేద్కర్‌, గడ్కరీని ఐకాన్‌గా భావిస్తున్నారని అన్నారు. దీంతో పాటు.. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడణవీస్‌తో తెల్లవారుజామునే ప్రమాణస్వీకారం చేయించారు. అటు మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్‌ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోశ్యారీ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/international-news/