తెలంగాణ భవన్ లో దొంగలు పడ్డారు

అదేంటి అనుకుంటున్నారా..నిజమే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..ప్రతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబదించిన బిఆర్ఎస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న గురువారం మహబూబాబాద్ లోక్ సభ సెగ్మెంట్ నేతలతో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.

దొంగలు తమ చేతు వాటం చూపించారు. ఓ ఎమ్మెల్యే జేబు నుంచి డబ్బులు కాజేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు జేబు నుంచి రూ.12 వేలు కొట్టేశారట. అంతే కాకుండా మరో కార్యకర్తకు చెందిన ఫోన్, ఇంకో కార్యకర్త నుంచి రూ.42 వేలను మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో కొట్టేశారు ఈ దొంగలు. సమావేశాల్లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో నాయకులు వస్తుండటం, మధ్యాహ్న భోజన సమయంలో రద్దీ ఉండటంతో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం) నుంచి తెలంగాణ భవన్ వద్ద భద్రతను మరింత పటిష్టం చేయాలని పార్టీ నిర్ణయించింది. అనుమతి లేనివారిని లోపలికి నో ఎంట్రీ అని తెలిపింది.