ఇంట్లో దొంగతనం.. టమాటాలు మాయం

మాములుగా ఇంట్లో దొంగలు పడితే నగలు , బంగారం , విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న టమాటాలు సైతం ఎత్తుకెళ్తున్నారు. ప్రస్తుతం టమాటా ల డిమాండ్ ఏ మేరకు ఉందో చెప్పాల్సిన పనిలేదు. నెలక్రితం వరకు కేజీ టమాటా రూ.20 ఉండగా .. క్రమక్రమంగా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం రూ.100 నుండి రూ.120 పలుకుతుంది. టమాటా ధర వందకు చేరడం తో వాటిని కొనేందుకు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కేజీ తీసుకునే దగ్గర పావుకేజీ తీసుకొని సరిపెట్టుకుంటున్నారు. కొందరైతే అసలు టమాటా వైపు చూసేందుకు కూడా భయపడుతున్నారు.

టమాటాలతో పాటు నిత్యం కూరల్లో ఉపయోగించే పచ్చిమిర్చి ధర భారీగా పెరిగింది. కేజీ రూ.40 లేదా రూ.60కి లభించే పచ్చిమిర్చి.. ఇప్పుడు రూ.120కి చేరుకుంది. దీంతో ప్రజలు పచ్చిమిర్చిని తక్కువ మొత్తంలోనే ఉపయోగిస్తున్నారు. ఇదే క్రమంలో దొంగలు సైతం తమ చేతివాటం చూపిస్తున్నారు. మార్కెట్ లలోనే కాదు ఇళ్లలో కూడా దొంగలు పడి టమాటా లు ఎత్తుకెళ్తున్నారు.

తాజాగా ఓ ఇంట్లో చోరీ చేయడానికి వెళ్లిన దొంగలు నగదుతో పాటు టమాటాలు కూడా దొంగిలించారు. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో చోటుచేసుకుంది. బోధన్ పట్టణంలోని గౌడ్స్‌ కాలనీకి చెందిన మున్సిపల్‌ ఉద్యోగి రఫీ కుటుంబం సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున తిరిగొచ్చి చూసేసరికి ఇంటి తాళం ధ్వంసం చేసి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.1.28 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఫ్రిడ్జ్‌ తెరిచి ఉండటంతో అందులో పరిశీలించగా కిలో టమాటాలు కూడా ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. బాధితుడు రఫీ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.