రేవంత్ వ్యాఖ్యలు..బిఆర్ఎస్ కు బలం చేకూర్చాయి

రాష్ట్రంలో కాంగ్రెస్ బలం రోజు రోజుకు పెరుగుతుంది. అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ లో చేరుతున్నారు. ప్రజల్లోనూ కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే భావన పెరుగుతుంది. ఎలా..? ఏంచేస్తే కాంగ్రెస్ బలం తగ్గుతుంది..? ప్రజల్లో కాంగ్రెస్ ఫై ద్వేషం పెరగాలంటే ఎలా..? ఇలా మొన్నటి వరకు బిఆర్ఎస్ నేతలు మాట్లాడుకున్నారు. కానీ వారికీ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు రేవంత్. అదే ఉచిత కరెంట్. రాష్ట్రం లో 24 గంటలు ఉచిత కరెంట్ అవసరం లేదని , మూడు ఎకరాలకు మూడు గంటలు చాలని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అదే బిఆర్ఎస్ నేతలకు ఆయువు పట్టు అయ్యింది. రేవంత్ అన్న ఆ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఆందోళలనలు, నిరసనలు , దిష్టిబొమ్మ దగ్దలు చేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ వస్తే వామ్మో అనుకునేలా ప్రణాళిక మొదలుపెట్టారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్‌ మీద ఉన్న ఆపార్టీ మానసి స్థైర్యం దెబ్బ తీసేందుకు ఈ వ్యాఖ్యలపై దూకుడుగా వ్యూహాన్ని రచించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే రియాక్ట్ అయిన పార్టీ అధినాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలకు పిలుపునిచ్చింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో విస్తుృతంగా ప్రచారం చేస్తోంది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఈ ఉచిత విద్యుత్‌దే కీలక పాత్ర. అప్పటి నుంచి దీన్ని అందిపుచ్చుకున్న పార్టీలు వివిధ రాష్ట్రాల్లో దీన్నో ఓట్ల మంత్ర దండంలా వాడుకుంటున్నాయి. అందుకే దీన్ని చాలా నైస్‌గా డీల్ చేయాలంటారు. అలాంటి సెన్సిటివ్‌ ఇష్యూపై రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.

రేవంత్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం, చేసిన ప్లేస్‌ వేరు అయినా సరే ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ చేసిన కామెంట్స్‌ను ప్రత్యర్థులకు బలం చేకూరేలా చేసాయి. వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ వాటిని క్షణాల్లోనే వైరల్ చేసింది. రేవంత్‌ చేసిన కామెంట్స్‌ను కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులతో వీడియోలు కూడా క్రియేట్ చేసింది. ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు కూడా వ్యతిరేకమంటూ పోస్టర్లు సిద్ధం చేసి ప్రచారం చేయడం స్టార్ట్ చేసారు. దీనిని ఎదురుకోవడం కాంగ్రెస్ నేతల వల్ల కూడా కావడం లేదు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటలు ఇస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాటి సీనియర్ నేతలు చెపుతున్న..పార్టీ అధ్యక్షుడే 8 గంటలు చాలు అన్నట్లు మాట్లాడితే..మీరు ఏంటి అన్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు.

మొత్తం మీద రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి పెద్ద తలనొప్పిగా మారింది. అసలే ఎన్నికల సమయం వచ్చింది. ఏమాట్లాడిన ఆచితూచి మాట్లాడాలి. సాధ్యమైనంత వరకు వివాదాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇలాంటి సమయంలో ఎవరైనా నాయకుడు నోరు జారారా అంతే. ప్రత్యర్థులకు చిక్కినట్టే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది. మరి కాంగ్రెస్ నేతలు ఏంచేస్తారో..రేవంత్ ఏమంటారో చూడాలి.