పరీక్షలు బాగా రాయలేదని ఆత్మహత్య చేసుకున్న యువతీ

ఇటీవల కాలంలో యువత చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని , ఫోన్ కొనివ్వలేదని , ప్రేమ విఫలమైందని ఇలా చిన్న చిన్న వాటికే తిరిగిరానిలోకానికి వెళ్లిపోతున్నారు. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్షల్లో పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపం తో ఇంటర్ చదువుతున్న యువతీ ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జన్నవలస గ్రామంలో నివాసం ఉండే ముమ్మిన వెంకట చిరంజీవి అనే వ్యక్తికి పెళ్లై ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె సాయిశ్రీ (17) బోయపాలెంలోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంటర్ చదువుతూ హాస్టల్ లోనే ఉంటుంది. అయితే గత కొంత కాలం నుంచి సాయిశ్రీ కడుపు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇంటర్ పరీక్షలు ఉండడంతో అనారోగ్యం కారణంతో అనుకున్న స్థాయిలో చదవలేకపోయింది. దీంతో పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదు. మార్కులు తక్కువగా వస్తే ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల ముందు తల ఎత్తుకోలేను అని తన రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కు ముందు ఓ లెటర్ రాసింది. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. చెల్లి.. బాగా చదువుకుని అమ్మానాన్నలకు మంచి పేరును తీసుకురా. అమ్మానాన్న నన్ను క్షమించండి అంటూ.. సాయిశ్రీ సూసైడ్ నోట్ రాసింది. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ సిబ్బంది వెంటనే సాయిశ్రీని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం కాలేజీ యాజమాన్యం ఇదే విషయాన్ని సాయిశ్రీ తల్లిదండ్రులకు వివరించారు.

ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.