పోలీసు అధికారిణి రాజేశ్వరి సేవ‌లు ప్ర‌శంస‌నీయం

ఆమెను జ‌న‌సేన పార్టీ అభినందిస్తోంది..ప‌వ‌న్


అమరావతి: త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు కురిసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో చెన్నై లోని టీపీ చత్రమ్ ప్రాంతంలో స్పృహ కోల్పోయి, ప‌డిపోయిన 28 ఏళ్ల ఓ వ్య‌క్తిని తన భుజాలపై మోసుకెళ్లి ఓ మ‌హిళా ఎస్సై ర‌క్షించిన విష‌యం తెలిసిందే. అక్కడే ఉన్న ఆటోలోకి ఎక్కించి అతనిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆమెపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

‘భారీ వర్షాలలో సైతం భారమైనా బాధ్యతను నెరవేర్చిన పోలీసు అధికారిణి రాజేశ్వరి గారు చెన్నై తుపాను సహాయక చర్యల్లో సృహ కోల్పోయిన వ్యక్తిని తన భుజంపై వేసుకొని ఆటోలో ఆసుపత్రికి తరలించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. ఆమెకు వీరమహిళ విభాగం తరుపున సెల్యూట్’ అని జ‌న‌సేన వీర‌మ‌హిళా విభాగం ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. దాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రీట్వీట్ చేశారు.

ఆ మ‌హిళా ఎస్సై చేసిన ప‌ని ప్ర‌శంస‌నీయ‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. చెన్నైలో వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో మ‌హిళా ఎస్సై రాజేశ్వ‌రి త‌న సేవ‌లతో స్ఫూర్తిదాయ‌కంగా నిలిచార‌ని చెప్పారు. ఆమెను జ‌న‌సేన పార్టీ అభినందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కాగా, ప‌లువురు ఐపీఎస్ అధికారులు కూడా మ‌హిళా ఎస్సై అందించిన సేవ‌ల‌ను కొనియాడారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/