శాంతి ఒప్పందం-భ్రాంతిపూర్వకం

america -afghanistan
america -afghanistan

ఆ ప్ఘానిస్థాన్‌లో తాలిబన్‌లతో అమెరికా సాధించిన శాంతి ఒప్పందం వాస్తవానికి ఒక భ్రాంతి ఒప్పందం. పెద్దగా ఉపయోగం లేనిది. గౌరవప్రదంగా తాము ఆ దేశం నుండి వైదొలగడానికి, పలాయనం చిత్తగించారన్న అపప్రద పడకుండా తప్పించుకోవడానికి అమెరికా ముందుకి తీసుకువచ్చిన సాకు. 19 ఏళ్లుగా తీవ్రవాదాన్ని తుదముట్టించే యుద్ధం పేరుతో అమెరికా సైనిక బలగాలు ఆప్ఘానిస్థాన్‌ భూభాగంలో తిష్టవేశాయి. ఒక దేశాన్ని అక్కడి ప్రభుత్వాన్ని, ప్రజల్ని మిత్రులుగా భావించి పై నుండి బలం పెంచి, సహకరించి తీవ్రవాదాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం వేరు. ఆ పేరుతో అక్కడ చొరబడి, అక్కడి నాయకత్వాన్ని వెనక్కినెట్టి మేమే యుద్ధం చేసేస్తామని దూరడం వేరు. అలానే దూరి అమెరికా వేలాది తన సైనిక ప్రాణాల్ని, ధనాన్ని కోల్పోయింది. ట్రంప్‌ తన ఎన్నికల ప్రణాళికలో ఆప్ఘాన్‌ నుండి సేనల్ని విరమిస్తామని హామీ ఇచ్చి గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లేముందు ఆ హామీ నెరవేర్చినట్టు చూపించుకోవాలి. అక్కడ చూస్తే పరిస్థితులు యధాతథం. అందుకనే త్వరత్వరగా శాంతి ఒప్పందం అంటూ ఖరారు చేశారు. అదీ తీవ్రవాదులతో తాము ఎవరినైతే అణిచేస్తామని అనుకున్నారో వారితోనే. అక్కడి ప్రభుత్వం ఊసులేకుండానే. అది కూడా హింసను తగ్గించుకుంటామని, అమెరికా, వారి మిత్రదేశాలకున్న ఉగ్రవాద ముప్పులకు ఆ భూభాగం నుండి సహకారం అందకుండా చూస్తామని. ఆ మాటలు నమ్మి వేలాది తాలిబన్‌ ఖైదీల్ని విడిచిపెట్టాలట. వారిపైనున్న అంతర్జాతీయ సంస్థ నిషేధాల్ని ఎత్తేయాలట. అమెరికా సేనలు అక్కడ ఉన్నప్పుడే తాలిబన్‌ తీవ్రవాదులు ఆ దేశంలో సగం భూభాగాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వారు వైదొలిగాక ఇంకా శాంతిపన్నాలు చెప్తారా? వారు పాకిస్థాన్‌కి మిత్రులు. అక్కడి ప్రభుత్వం మనవైపు స్నేహంగా చూస్తున్నా అది బలహీన నాయకత్వం. కాబట్టి మనదేశం మరింత అప్రమత్తంగా ఉండటం అవసరం. సరిహద్దుల్లో రాగల ముప్పుని అంచనా వేసి అందుకు తగ్గ సన్నద్ధత పాటించాలి.

  • డా.డి.వి.జి.శంకరరావు

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/