సంక్షోభంలో ‘రియల్‌’ పరిశ్రమ

లాక్‌డౌన్‌తో కోలుకోలేని పరిస్థితి

Crisis in Real estate sector
Crisis in Real estate sector

కరోనా వ్యాప్తి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం నగర శివార్లతో పాటు రెండు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో వెలసిన వెంచర్లు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు, విలాసవంతమైన విల్లాల అమ్మకాలు, కొనుగోళ్లలో ఇప్పుడు స్తబ్దత నెలకొంది.

లాక్‌డౌన్‌ కంటే ముందున్న వ్యాపారంతో పోల్చితే 60 శాతం మేర పడిపోయింది.

దీంతో వివిధ బ్యాంకులు, ఎన్‌బి ఎఫ్‌సిలు, హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా రుణాలు తీసుకుని వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద స్థిరాస్థి వ్యాపార సంస్థలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయి.

భూములు కొంటే ఎప్పటికైనా లాభమేకదా అనే భావనతో అప్పులు తెచ్చి లాభార్జన కోసం ఈ వ్యాపారంలోకి దిగిన మధ్యతరగతి వర్గాలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నాయి.

కరోనా వైరస్‌తో ఏర్పడ్డ లాక్‌డౌన్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది.

సాధారణంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి నెలకు సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు ఆదాయం స్టాంప్‌డ్యూటీ ద్వారా వచ్చేది. ఇప్పుడు ఆ ఆదాయంలో భారీ కోత పడింది. ఈ పరి ణామం ప్రభుత్వాలకు కూడా ఇబ్బందిగానే తయారైంది.

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కొంతకాలంగా కొత్త రిజర్వేషన్లు అవ్ఞ తున్నా అవన్నీ లాక్‌డౌన్‌కు ముందు ఒప్పందాలు చేసుకొని మధ్య లో ఆగిపోయినవే ఎక్కువ ఉంటున్నాయి.

కరోనా కేసులు రోజుకు వేలల్లో నమోదవ్ఞతున్న నేపథ్యంలో కొత్తగా అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ విశాఖలోనైతే ఈ రంగం మీదే ఆధారపడ్డ కొన్ని లక్షల కుటుం బాల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. దేశంలో ముంబాయి తర్వాత రెండో అతిపెద్ద రియల్‌ పరిశ్రమ హైదరాబా ద్‌లోనే ఉంది.

హైదరాబాద్‌ తరువాతే బెంగళూరు, పూణె, చెన్నై నగరాలు వరుసలో ఉంటాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగం తరు వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న రెండో అతిపెద్ద ఆర్థికరంగం కూడా ఇదే. ఇప్పుడిక్కడ నిర్మాణంలో ఉన్న వేలాది రియల్‌ ప్రాజెక్టుల భవితవ్యం డోలాయమానంలో పడింది.

లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కూడా రియల్‌బూమ్‌ అదే వేగంతో పుంజుకోలేదు. లాభాలు అటుంచి కనీసం అసలు సొమ్మైనా రాబట్టుకుందామనే ప్రయత్నంతో డెవలపర్లు, బిల్డర్లు ఉన్నారు. కానీ దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి రానురాను పెరుగుతూనే ఉండడంతో వీరి ఆశలు నీరుగారిపోతున్నాయి.

హైదరాబాద్‌, విశాఖ నగరాల్లో బడా కంపె నీలు నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయి.

నిర్మాణం పూర్తయినవి ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనాసరే భూములు కొనాలంటే కొంచెం ఆచితూచి అడుగేసే పరిస్థితే కనిపిస్తోంది.

కరోనా ఎఫెక్ట్‌ కొన్ని సంవత్సరాలపాటు ఉంటుందనే భయాలున్న నేపథ్యంలో తమ చేతిలో ఉన్న కొద్దిపాటి నగదు మొత్తాలతో భవిష్యత్‌ పెట్టు బడి కోసం భూములు కొనడానికి ముందుకు రావడానికి జంకుతున్నారు.

అపార్టుమెంటు ఫ్లాట్స్‌, ఇండిపెండెంట్‌ గృహాలు కొనా లన్నా నూటికితొంభైశాతం మంది బ్యాంకు రుణంపైనే ఆధారపడతారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతకాలం పాటు బ్యాంకులు రుణ పరిమితిని కూడా తగ్గిస్తున్నాయి. దీంతోచాలీచాలని నిధులతో గృహాలు ఎలా కొనాలో తెలియక వినియోగదారులు తలలు పట్టు కుంటున్నారు

ఆకస్మాత్తుగా వచ్చిపడ్డ లాక్‌డౌన్‌ సమస్యతో నిర్మాణ రంగ కంపెనీలు మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టుల్ని ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేసే అవకాశాలు ఉండవు.. ఎందుకంటే కూలీ లందరూ ఇంటిదారి పట్టారు.

హైదరాబాద్‌ ఖాళీ అయిపోయిన పరిస్థితి ఉంది. నిర్మాణరంగ కూలీల్లో ఎక్కువ మంది బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల వారే.

నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పటికే స్వస్థలా లకు వెళ్లిపోయిన కూలీలు ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితి కనిపిం చడం లేదు.

స్థానికంగా ఉన్న కొద్ది మంది కూలీలతో పనులు మొదలు పెట్టినా పనులు నత్తనడకన నడుస్తున్నాయి.ఈ నేపథ్యం లో ఎలా చూసుకున్నా రియల్‌ రంగానికి కొంతకాలం గడ్డు రోజులే కనిపిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత రియల్‌ కార్యకలాపాలు యధాతథంగా చేరుకుంటాయని అందరూ భావిం చారు. కానీ అది అనుకున్న స్థాయిలో కాదుగదా కనీస స్థాయిలో కూడా జరగట్లేదు.

తిరిగి రియల్‌ జోరు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. స్థానిక కూలీలను ప్రోత్స హించే ప్రయత్నాలు చేసింది.

రియల్‌ పరిశ్రమ తిరిగి పుంజుకునే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కానీ నగరంలో రోజురోజుకూ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్న కొత్త పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఉన్న కూలీలు సైతం ముందుకురావ డం లేదు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్థం (జనవరి నుంచి జూన్‌)లో ఆఫీస్‌ స్పేస్‌ లావా దేవీలు సైతం 43 శాతం తగ్గాయని రియల్‌ ఎస్టేట్‌ రీసెర్చి సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ఇటీవల వెల్లడించింది.

ఈ సమయంలో కేవలం 4,782 యూనిట్లు మాత్రమే అమ్ముడుబోతున్నాయి. కొత్త ఆఫీస్‌ స్పేస్‌ విక్రయాలు కూడా 32 శాతం క్షీణించాయి.

గడిచిన అయిదు సంవత్సరాల్లో హైదరాబాద్‌ ఆఫీస్‌ మార్కెట్‌స్పేస్‌ 172 శాతం పెరిగింది. 2019లో హైదరాబాద్‌ నగరంలో రికార్డుస్థాయి లో 1.28 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం లావాదేవీలు జరిగాయి.

కొవిడ్‌-19 తరువాత ఈ రంగం తీవ్రంగా దెబ్బతింది. కరోనా ప్రభావం ఆఫీస్‌ స్పేస్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపు తోంది. ఇండస్ట్రీస్‌ అమ్మకాలు 75 శాతం తగ్గిపోయాయి.

ఈ మొత్తం లావాదేవీల్లో ఐటి విభాగానిదే 75 శాతం కావడం గమనార్హం. ఐటి పరిశ్రమ ఏమాత్రం డీలాపడ్డా రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది.

ఆదాయంపై అనిశ్చితి కొనసాగుతున్నం దున హౌసింగ్‌ రంగానికి డిమాండ్‌ బాగా తగ్గింది.

ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ విశాఖ నగరాలనే కాకుండా మొత్తమ్మీద అన్ని ప్రధాన నగరాల్లో లెక్కలు తీస్తే హౌసింగ్‌ సేల్స్‌ 56శాతం తగ్గినట్టు వెల్లడవుతోంది.

ఓపెన్‌ ఫ్లాట్‌ల అమ్మకాలు 70 శాతం మేర పడిపోయాయి. ఈ నేపథ్యంలో రియల్‌ రంగం మళ్లీ గాడిన పడి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం ఒక్కటే సరిపోవడం లేదు.

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మినహా మరో మార్గం ఎక్కడా కనిపించడం లేదు.

  • శ్రీనివాస్‌గౌడ్‌ ముద్దం

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/