కొత్త దంపతుల అపూర్వ సేవ

పెళ్లి మండపంలో పేదలకోసం విరాళాల పెట్టెలు

A married couple
A married couple

ఆహారానికి నోచుకోలేక మనదేశంలో అనేకులు మరణిస్తున్నారు. ఏటా దాదాపు 25 లక్షలమంది ఆకలితో చనిపోతున్నారు అంటే ఎంత దయనీయపరిస్థితిలో మనం ఉన్నామో గ్రహించలేకున్నాం. అందుకే పెళ్లిళ్లలో అధిక దుబారాను చాలా సులభంగా చేస్తున్నాం.

కేవలం ఒకరోజు ఉంచి తీసి పారేసే మంటపానికీ ఓ నిమిషం చూసి పక్కన పడేసే శుభలేఖలకూ ఒక్క రోజులో వాడిపోయే పూలకూ లక్షల డబ్బును వృధా చేస్తున్నాం.

ఆ డబ్బును వృథా చేసే బదులు అలాంటి పేదల ఆకలి తీర్చాలని అనుకుండా ఉండగలమా ఆవైపే ఆలోచించింది ఈతరం. ఫలితం సరికొత్త వివాహ సంప్రదాయానికి తెరలేచింది.

ఈ కొత్త పెళ్లి తంతులోనూ ఇచ్చిపుచ్చుకోవడాలూ విందు భోజనాలూ ఉంటాయి.

అయితే, వాటిలో హంగులూ ఆర్భాటాలకు బదులు మంచితనం, మానవత్వం పాళ్లే ఎక్కువ. అవును, ఇక్కడ ఇవ్వడం అంటే వియ్యాలవారు ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం కాదు.

ఇద్దరూ కలిసి పెళ్లి ఖర్చుని తగ్గించుకుని అప్పులపాలైన రైతులకు అండగా నిలబడటం.

ఇళ్లులేని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడం. ఏ ఆధారం లేని వృద్ధులకూ పేదలకూ తోచినంత సాయం చేయడం, పేద విద్యార్థులకు ఫీజులు కట్టి వారి బంగారు భవితకు పునాదులు వేయడం.

ఇక మన సాయాన్ని అందుకున్నవారు సంతోషం నిండిన మనసుతో నిండునూరేళ్లూ సుఖంగా ఉండండి అని ఇచ్చే దీవెనలకన్నా పుచ్చుకోవడానికి గొప్ప కానుక ఏముంటుంది? విందు భోజనాలంటారా ఎప్పటికపుడు రకరకాల రుచులను ఆస్వాదిస్తూనే ఉంటారు.

మన బంధువులూ స్నేహితులూ. వారి కోసం వందరకాల వంటకాలతో భోజనాల్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యంగా చూస్తారే తప్ప అన్ని వంటకాలనూ తినేయలేరు.

దాంతో రుచి చూసి కొన్ని చూడక కొన్ని చెత్తబుట్టలోకి చేరడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. కొన్నిచోట్ల ఉత్సాహం అంచనాలను దాటి, వంటకాలు అతిథుల్ని మించిపోతాయి.

అదీ వృథానే.

ఇలా వేరువేరు కారణాలతో మనదేశంలో ఏటా చెత్తబుట్టలోకి చేరే నాణ్యమైన ఆహారం విలువ అక్షరాలా యాభైవేల కోట్ల రూపాయలు.

ఈ లెక్కలన్నీ తెలిసినా తెలియకపోయినా తమవంతుగా ఆ వృథాను అరికట్టి మిగిలిన సొమ్మును అనాథాశ్రమాలకూ, పేదలకు అన్నదానం చేసే సత్రాలకూ అందించాలని ప్రయతిస్తున్న వారు ఈమధ్య దేశవ్యాప్తంగా పెరుగుతున్నారు.

తాము చేయడమే కాదు, బంధువ్ఞల్నీ పెళ్లికొచ్చే అతిథుల్ని కూడా ఈ కళ్యాణ సేవలో భాగస్వాముల్ని చేస్తున్నాయి కొన్ని జంటలు.

‘మీ నుంచి మాకు ఎలాంటి బహుమతులూ వద్దు అన్నారు.

అందుకు బదులుగా మాతోపాటు మీరు కూడా అనాథ వృద్ధుల్ని చేరదీసే ఆశ్రమాలకు, రైతులకు, పేద పిల్లల్ని చదివించే స్వచ్ఛంద సంస్థలకూ తోచినంత విరాళంగా ఇవ్వండి ..అంటూ పెళ్లి మంటపంలో విరాళాల పెట్టెల్ని పెడుతున్నారు.

మరో అడుగు ముందుకేసి, వివాహవేడుక దగ్గరే అవయవదాన, రక్తదానశిబిరాలను ఏర్పాటు చేసే వారూ పెరిగారు.

మామూలుగా చేస్తే ఏ పెళ్లైనా ఒకటీ రెండురోజుల వేడుకే. కానీ ఇలా చేయడం వల్ల సాయం అందుకున్నవారికి ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పండుగ అవుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news