జనసేనకు జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్..!

జనసేన పార్టీకి అన్ని ఎగ్జిట్ పోల్స్ జై కొట్టాయి. ఆ పార్టీ దాదాపు 15 నుంచి 18 అసెంబ్లీ స్థానాల్లో గెలవనుందని అంచనా వేశాయి. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ శనివారం సాయంత్రం వెల్లడయ్యాయి. వివిధ మీడియా, సర్వే సంస్థలు ఫలితాలను వెలువరించాయి. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని మెజార్టీ సంస్థలు తెలుపగా.. ఏపీలో మెజార్టీ పోల్స్ మాత్రం కూటమిదే విజయం అని తేల్చాయి.

లోక్ సభ స్థానాలే కాదు అసెంబ్లీ స్థానాలు సైతం కూటమి పెద్ద ఎత్తున సాదించబోతుందని చెప్పుకొచ్చాయి. అలాగే జనసేన పార్టీ సైతం 21 స్థానాలు పోటీ చేయగా..వాటిలో దాదాపు 14 నుండి 18 స్థానాల వరకు విజయం సాదిస్తుందని తెలిపాయి. అలాగే పార్లమెంట్ కు పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంటుందని వెల్లడించాయి. దాదాపు పోటీ చేసిన మొత్తం సీట్లను జనసేన గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ 40 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అన్ని సర్వేలు తెలిపాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ తో జనసేన శ్రేణులు , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.