వ్యాట్‌ను రాష్ట్రాలు త‌గ్గిస్తేనే పెట్రో ధ‌ర‌లు త‌గ్గుతాయి : ప్ర‌ధాని మోడీ

సీఎంలతో కరోనా సమీక్షలో ప్రధాని వ్యాఖ్య‌లు
పిల్లల వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వండి..మోడీ

YouTube video
PM Modi’s remarks at interaction with Chief Ministers on Covid-19 situation

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో బుధవారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పిల్లల వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని కోరారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు, పరిస్థితిని సమీక్షించారు. కరోనా సంక్షోభాన్ని పూర్తిగా అధిగమించలేదని హెచ్చరించారు. చాలా రోజుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయని, అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సంగతిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ అర్హత ఉన్న పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయాలని, వారి టీకా కవరేజీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీని కోసం స్కూళ్లలో ప్రత్యేక టీకా శిబిరాలు నిర్వహించాలని, టీచర్లతోపాటు తల్లిదండ్రులకు దీని గురించి సమాచారం ఇవ్వాలన్నారు.


ఇతర దేశాలతో పోల్చితే దేశంలో కరోనా సంక్షోభాన్ని బాగా నియంత్రించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదలను ప్రస్తుతం చూస్తున్నామని చెప్పారు. దీంతో కరోనా ఛాలెంజ్‌ను ఇంకా అధిగమించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలని, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు బహిరంగ ప్రదేశాల్లో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

దేశంలో అంత‌కంత‌కూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ప్ర‌ధాన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల వైఖ‌రి కార‌ణంగానే దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మ‌క్షంలోనే మోడీ ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. “పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలే కార‌ణం. రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్‌ను త‌గ్గిస్తేనే పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గుతాయి. కేంద్రం, రాష్ట్రాలు క‌లిసి ప‌నిచేస్తేనే ధ‌ర‌లు త‌గ్గుతాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ త‌గ్గించినా…రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్‌ను త‌గ్గించ‌డం లేదు. తెలంగాణ‌, ఏపీ, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాట్ త‌గ్గించ‌డం లేదు. వ్యాట్ త‌గ్గించ‌ని కార‌ణంగానే పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికైనా పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ప‌న్నులు త‌గ్గించాలి” అని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/